కేసీఆర్-జగన్ సెంటిమెంట్ అస్త్రం..బండి లాజిక్ కరెక్ట్..!

-

తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా ముందుకెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..వరుసపెట్టి పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యలో ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే బీజేపీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేస్తున్నారు. ఇలా నిత్యం కేసీఆర్ ప్రభుత్వం టార్గెట్ గా ఫైర్ అవుతున్న బండి..తాజాగా ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేశారు. తాజాగా ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓడిపోతే కార్యకర్తలు ఏడ్చారని.. దానిపై దేశం అంతా చర్చ జరిగిందని బండి సంజయ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అని.. కార్యకర్తల కష్టం వల్లే తాను లక్ష మెజార్టీతో గెలిచానని చెప్పారు. కరీంనగర్ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు.

ఇదే సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికార పార్టీలు సెంటిమెంటుతో మళ్లీ గెలవాలని చూస్తున్నారని కేసీఆర్, జగన్‌లపై బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇద్దరు కలిసి రకరకాల వంటలతో విందు చేసి, హత్తుకున్నారని..నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్రా అను.. నన్ను ప్రజలు తిరస్కరిస్తే జై తెలంగాణ అంట అని పథకం వేశారని..కలిసి పంచుకుందాం.. కలిసి దోచుకుందాం అని ఒప్పందం చేసుకున్నారని ఫైర్ అయ్యారు.

అయితే బండి విమర్శల్లో లాజిక్ ఉందని చెప్పవచ్చు. రాజకీయంగా లబ్ది పొందడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమయానికి తగ్గట్టుగా కొట్లాటని మొదలుపెడుతున్నారు. సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఏపీ-తెలంగాణని కలిపితే తమకే మంచిదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ నేతలు ఫైర్ అయ్యారు. అటు ఉమ్మడి ఏపీ అని, ఇటు తెలంగాణ అని చెప్పి సెంటిమెంట్ లేపడానికి ట్రై చేసినట్లు కనిపించింది. కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి సెంటిమెంట్ లేపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news