యాంటీ బీజేపీ..కేసీఆర్‌కు కొత్త చిక్కు?

-

ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ ఒక్కటే..కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌ని గద్దె దించడం..ఎలాగైనా కేంద్రంలో బీజేపీని కిందుకు లాగాలని చెప్పి కేసీఆర్ తెగ ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. గతంలోనే కేసీఆర్…మోడీ సర్కార్‌ని గద్దె దించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఇప్పుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు బలపడుతున్న నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకెళ్లడం మొదలుపెట్టారు.

cm kcr bjp party

దేశంలో బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలని కూడగట్టి కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇప్పటికే స్టాలిన్, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్ లాంటి వారితో మాట్లాడిన కేసీఆర్..తాజాగా శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే అని కలిశారు. అలాగే ఎన్‌సి‌పి అధినేత శరద్ పవార్‌తో కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలో వారు..కేంద్రంలో బీజేపీని ఎలా గద్దె దించాలనే అంశంపై చర్చలు చేసుకున్నారు.

ప్రస్తుతం దేశం నడుస్తున్న తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉందని, బలమైన భారత్‌ను నిర్మించాలన్న అంశంపై తాను, ఉద్ధవ్‌ ఏకాభిప్రాయంతో ఉన్నామని కేసీఆర్ తెలిపారు. అటు శరద్ పవార్ సైతం…బీజేపీపై కేసీఆర్ చేస్తున్న యుద్ధానికి మద్ధతు ఇచ్చారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నయంగా సాధ్యమా? అన్న విలేకరుల ప్రశ్నకు కేసీఆర్‌ బదులిస్తూ, ‘ఇప్పుడే జ్యోతిషం చెప్పడం సరికాదని, ఒకే ఆలోచనలతో ఉన్న దేశంలోని ఇతర పార్టీలు, నేతలందరినీ సంప్రదిస్తున్నామని, ప్రత్యామ్నాయం ఎలా ఉండాలో అందరం కలిసి చర్చించి నిర్ణయిస్తామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు కేసీఆర్ కలిసేవారంతా కాంగ్రెస్‌తో కలిసి పయనిస్తున్న వారే…మరి అలాంటప్పుడు వారు కాంగ్రెస్ లేకుండా మూడో ఫ్రంట్ పెట్టడానికి ఒప్పుకోవడం కష్టమనే చెప్పాలి..అంటే కేసీఆర్ ఖచ్చితంగా కాంగ్రెస్‌ని కూడా కలవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ పెడితే…మళ్ళీ బీజేపీకి ఉపయోగపడుతుంది. మరి చూడాలి ఈ ఫ్రంట్ రాజకీయాలు ఎంతవరకు వెళ్తాయో.

Read more RELATED
Recommended to you

Latest news