రిజిస్ట్రేషన్లపై కేబినెట్ సబ్ కమిటీని నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన ముగ్గురు మంత్రులతో కమిటీ నియమించారు. మూడ్రోజుల్లో బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సమావేశం కానుంది సబ్ కమిటీ. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగుతున్నాయని…వ్యవసాయేతర భూముల విషయంలోనూ అలాంటి విధానమే రావాలన్నారు సీఎం కేసీఆర్. ప్రజలెవరూ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావొద్దాన్నారు.
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా, ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. సబ్ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు.