కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.తెలంగాణ భవన్‌లో కొనసాగుతున్న బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ గందరగోళం నెలకొంటుందని, ఏది జరిగినా బీఆర్ఎస్ కే మేలు అని అన్నారు. ఉద్యమకాలం నాటి కేసిఆర్ ను మళ్లీ చూస్తారని, ఇవాళే బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేస్తానని తెలిపారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తమదే గెలుపని పార్టీ నేతలతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ లోకి వెళ్తాడని నేను అనుకోవడం లేదని కేసీఆర్ అన్నారు. ఒక వేళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లిన ఆయన వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లరని కేసిఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే, లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే తొలి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తుండగా.. కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని తాను అనుకోవడం లేదనడం హాట్ టాపిక్‌గా మారింది.