జాతీయ పార్టీ స్థాపనతో త్వరలో మీడియా ముందుకు రావాలని తపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్. ఈ క్రమంలో ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితినే జాతీయ పార్టీగా ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ మేరకు కారు గుర్తునే ఆయన కొనసాగించనున్నారు. అదేవిధంగా పార్టీ జెండా విధి విధానాలు అన్నీ టీఆర్ఎస్ ను పోలి ఉంటాయి. పెద్దగా మార్పులేమీ ఉండవు.
అయితే కొందరు మాత్రం దక్షిణ భారతావనిలో ఏపీ మినహా అన్ని చోట్ల కేసీఆర్ పోటీ చేస్తారు అని అంటున్నారు. మరికొందరు మాత్రం ఏపీలో కూడా అభ్యర్థులను నిలిపే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ వాదనలు అన్నీ తెలంగాణ నుంచి వస్తున్నవే కానీ ఆంధ్రాలో అసలు ఈ పార్టీ ఊసే లేదు. కేసీఆర్ కూడా ఆంధ్రాకు సంబంధించి ఇంతవరకూ ఏ స్పష్టతా ఇవ్వడం లేదు అని కూడా తెలుస్తోంది.
ఇక ఆంధ్రా విషయానికే వస్తే ఇప్పటిదాకా రెండు ప్రధాన పార్టీల మధ్యే పోరు నడుస్తోంది. ఒకవేళ బీజేపీ, జనసేనలు కూడా కీలకం కావాలనుకుంటే పొత్తులతోనే అది సాధ్యం. ఆ రెండు పార్టీలు క్షేత్ర స్థాయిలో ఇంకా పట్టు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక ఆంధ్రాలో మంచి ఫలితాలు అందుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించాలంటే మాత్రం ఎందుకనో కొన్ని అనుమానాలే వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఆయన ప్రాంతీయ వాదం బలంగా వినిపించి ఎదిగిన నేత. ఇప్పుడు మాత్రం జాతీయ వాదం నెత్తినపెట్టుకున్న వైనంపై విమర్శలున్నాయి. అందుకనే వీలున్నంత మేరకు ఆంధ్రాను మినహాయించి రాజకీయం చేయాలని అనుకుంటున్నారు. అయితే కేసీఆర్ పార్టీకి సంబంధించి సీపీఐ నారాయణ మినహా ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. నారాయణ కూడా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
కానీ పూర్తిగా ఆయన నిర్ణయానికి మద్దతు అయితే ఇవ్వలేదు. ఆయన మినహాయిస్తే ప్రధాన పార్టీలేవీ ఊహ మాత్రంగా అయినా మాట్లాడడం లేదు. ఒకవేళ ఇటుగా కేసీఆర్ వచ్చి రాజకీయాలు చేసే అవకాశాలుంటే ముందు ఆ రోజు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని పలువురు సామాజిక కార్యకర్తలు, ఆరోజు సమైక్యాంధ్రను కోరుకున్న వారు, విభజన వద్దని చెప్పి కేంద్రాన్ని ప్రాథేయ పడిన వారు అభిప్రాయపడుతున్నారు. విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయకుండా ఇకపై అయినా రాజకీయం చేయాలని కోరుతున్నారు.