అవినీతి కూపంలో నిండా మునిగిపోయిన కేసీఆర్ సర్కార్ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతుందని మండిపడ్డారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళన చేపట్టిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బేలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
గ్రూప్ 1 పేపర్ సైతం లీక్ అయిందని, దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. సమగ్ర దర్యాప్తు జరిపి చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా తప్పులను ఎత్తిచూపుతున్న వాళ్లపై అమానుషంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నిరసనకారుల గొంతు నొక్కుతుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఒక పేపర్ ప్రశ్నాపత్రం లీకేజీ పై విచారణ చేస్తుంటే.. ఇంకో ప్రశ్న పత్రం లీకేజీ అంశం వెలుగులోకి వస్తుందన్నారు. సమగ్ర విచారణ జరిపితే ఇంకెన్ని లీకులు బయటపడతాయోనని అన్నారు.