తెలంగాణాలో క్రమంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షా సమావేశాలు వరుసగా నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య తెలంగాణాలో 600 దాటింది. దీనిపై ఆయన అధికారులతో తన ఆలోచనలు పంచుకున్నారు. హైదరాబాద్ నగరంలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేసారు. ప్రత్యేక దృష్టి పెట్టాలని, లాక్ డౌన్ కఠినం గా అమలు చెయ్యాలి అని ఆదేశించారు.
ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్… అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటుగా ఇతర వైద్యశాఖ అధికారులు కూడా హాజరై పరిస్థితిని కేసీఆర్ కి వివరించారు. హైదరాబాద్ లో నమోదు అవుతున్న కేసుల వివరాలను ఆయన స్వయంగా ప్రస్తావించి అవసరం అయితే హైదరాబాద్ మొత్తాన్ని హాట్ స్పాట్ గా గుర్తించాలని సూచించారు.
మే 3నాటికి నగరంలో ఒక్క కేసు కూడా ఉండకూడదని అధికారులను ఆయన ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన పరిస్థితులను చర్చించారు. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పరిస్థితిని ఆయన ఆరా తీసారు. ఇక ఓల్డ్ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ఎక్కువగా పరిక్షలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణాలో 644 కేసులు ఉన్నాయి