తెలంగాణ, ఏపీ మధ్య ఇప్పుడు కృష్ణా నదీ జలాల విషయం ఎంతలా దుమారం రేపుతుందో అందరికీ తెలిసిందే. కాగా మొన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ కాస్త కేంద్రం బోర్డులకు పెత్తనం ఇవ్వడంతో వెనకబడ్డారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు హక్కుల కోసం ఎంత దాకైనా వెళ్లాల్సిందే అని లేకుంటే ప్రజల్లో తమ పార్టీ పట్ల ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్లం అవుతామంటూ ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదే విషయమై రాష్ట్రానికి ఏ మాత్రం అన్యాయం జరిగినా సహించేదే లేదని, విభజన చట్టానికి ఉల్లంఘనగా కృష్ణా, గోదావరి నదుల బోర్డులు తెలంగాణకు అన్యాయం చేస్తే దాన్ని అన్ని వేదికలపై నిలదీయాల్సిందేనని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించనట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో టీఆర్ ఎస్ పార్లమెంటరీ మీటింగ్ జరగ్గా ఇదే విషయంపై ఎంపీలకు కేసీఆర్ సూచనలు చేసినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ లో బోర్డులను నోటిఫై చేసే విధంగా తెలంగాణకు రావాల్సిన వాటాలపై లేవనెత్తాల్సిన అంశాలపై గులాబీ బాస్ చాలా రకాల సూచనలు చేసినట్టు సమాచారం. తెలంగాణలోని ప్రతి ప్రాజెక్టుల వారీగా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపై కొట్లాడి ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. మొత్తానికి మళ్లీ సెంటిమెంట్‌ను ఢిల్లీ వేదికగా రగిల్చే పనిలో పడ్డారు కేసీఆర్.