తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ పోలీసు శాఖలో కీలక మార్పులను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.త్వరలో పోలీసులకు కొత్త మాన్యువల్ అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
కొత్త మాన్యువల్ ముసాయిదాను సిద్ధం చేసిన అధికారులు న్యాయశాఖ పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఇది ఆమోదం పొంది అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసు శాఖ పరిపాలనాపరమైన అంశాలకు మాన్యువలే కీలకంగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ ఏపీ పోలీసు మాన్యువల్నే ఉపయోగిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సొంత మాన్యువల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త మ్యానువల్ ను రూపొందించారు.ఐదేళ్ల క్రితం రిటైర్డ్ ఐజీ గంగాధర్కు మాన్యువల్ రూపొందించేలా ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. సిబ్బంది పదోన్నతులు, బదిలీలు, సర్వీసు వ్యవహారాలను దిశానిర్దేశాలు మాన్యువల్ ప్రకారమే జరగాల్సి ఉన్న నేపథ్యంలో తెలంగాణ అవసరాలకు అనుగుణంగా నూతన మాన్యువల్ ముసాయిదాను ఇటీవలే ప్రభుత్వానికి పంపించారు. రాజ్యాంగానికి లోబడి, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పలు కొత్త ప్రతిపాదనలు ఈ ముసాయిదాలో పొందుపరినట్లు తెలుస్తుంది.
పోలీస్ శాఖలో TSSP, AR, సివిల్ విభాగాల వారీగా నియామకాలు జరుగుతుండగా ఆ తర్వాత ప్రతిభ ఆధారంగా ఒక విభాగం నుంచి మరో విభాగంలోకి వచ్చేందుకు (కన్వర్షన్)కు ఇప్పటి వరకు అవకాశం ఉండేది. అయితే ఈ విధానం వల్ల పదోన్నతుల సమయంలో న్యాయపరమైన చిక్కులు తలనొప్పి వ్యవహారంగా మారుతోంది. సీనియార్టీ విషయంలో తమకు అన్యాయం జరుగుతోందనే వాదనలు ఉద్యోగుల నుండి వస్తున్నాయి..దాంతో దానికి మంగళం పాడారు.. ఏ. శాఖలో ఎంపిక అయిన అధికారులు అదే శాఖలో పదవీ విరమణ పొందెలా ముసాయిదాలో పొందుపరినట్లు తెలుస్తుంది.