కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని రైలు సర్వీసులు రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 15 నుంచి మళ్ళీ రైలు సర్వీసులను రైల్వే శాఖ తిరిగి పునరుద్దరించనుంది. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14న ముగియనున్న నేపధ్యంలో… భారతీయ రైల్వే ఏప్రిల్ 15న సేవల్ని పునరుద్ధరించనుందని ఎకనమిక్ టైమ్స్ అనే జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.
రైల్వే సేవలు పూర్తి స్థాయిలో కాకుండా క్రమక్రమంగా అందుబాటులోకి వస్తాయని, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఏప్రిల్ 15 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తుందని ఆ కథనంలో పేర్కొన్నారు. లాక్‌డౌన్ పూర్తి కాగానే ప్యాసింజర్ సేవలను ప్రారంభిస్తున్నారు. కరోనా వైరస్ విస్తరించడానికి రైళ్ళు కూడా కారణం కావడంతో దేశంలో మార్చి 22 నుంచి మార్చి 31 వరకు ప్యాసింజర్ సేవల్ని నిలిపివేస్తూ ప్రకటన జారీ చేసారు.
ఆ తర్వాత నరేంద్ర మోదీ ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. దీనితో రైల్వే కూడా ఏప్రిల్ 14 వరకు ప్యాసింజర్ సేవల్ని నిలిపివేస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది. అయితే నిత్యావసర వస్తువులు, ఇతర సరుకులు, వైద్య పరికరాలను రవాణా చేసేందుకు గూడ్స్ రైళ్లను ఎప్పట్లాగే నడిపిస్తుంది. రోజుకు 9,000 గూడ్స్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి.