ఆ యువకుడికి పెళ్లి కావడం లేదు…దీనికి పక్కింటి వ్యక్తే కారణమనుకున్నాడు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అసహనానికి లోనయ్యాడు. ఏం చెయ్యాలా అని తెగ ఆలోచించాడు… అంతలో మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా గుర్తొచ్చింది. అంతే..ఇంకే ఆలోచించలేదు..చక చకా ఓ బుల్డోజర్ తీసుకొచ్చాడు. అంతే వేగంతో పొరుగున ఉన్న షాపును కూల్చేశాడు.
భవనాన్ని కూల్చుతున్న దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోకి రియల్ అయ్యప్పనుమ్ కోషియమ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. పొరుగింటి వ్యక్తి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకే భవనాన్ని కూల్చేశానని చెప్పుకొచ్చాడు. కేరళలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నూరు జిల్లాకు చెందిన 30 ఏళ్ల అల్బిన్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంట్లో వాళ్లు అతడికి ఇప్పటికే ఎన్నో సంబంధాలు చూసినా ఫలితం దక్కలేదు. దీంతో తమ పొరుగున షాపు యజమానే ఇందుకు కారణమని భావించిన అల్బిన్, అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించాడు. ఈ క్రమంలో జేసీబీతో ఆ షాపును కూలగొట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను, మలయాళ సినిమా అయ్యప్పనం కోశియంలోని రియల్ లైఫ్ సన్నివేశాల పేరుతో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.