తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. నగరంలోని ఏ మూల నుంచైనా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా మెట్రోరైలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్.. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్‌కు రూపకల్పన చేశారు. డిజైన్లను సిద్ధం చేసి, గతేడాది డిసెంబర్ 9న శంకుస్థాపన సైతం చేశారు. ఒకవైపు క్షేత్ర స్థాయిలో ఎయిర్‌పోర్టు మెట్రో పనులు కొనసాగుతుండగానే, ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ అయిన రాయదుర్గం- శంషాబాద్‌ల మధ్య ఉన్న 31 కి.మీ. పరిధిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఊహించని స్థాయిలో శరవేగంగా అభివృద్ధి చోటు చేసుకుంటున్నది.
ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో గుర్తించిన మెట్రో అధికారులు ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ కారిడార్‌లో మార్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఇటీవలే మెట్రో ఎం.డి. ఎన్వీఎస్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం ఎయిర్‌పోర్టు ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టులో.. ఆ మార్గంలోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.