ఖమ్మం టీఆర్ఎస్ లో‌ టెన్షన్..కోదండరామ్‌కు మద్దతిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్గం

-

ఎమ్మెల్సీ ఎన్నికలను అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తుంటే..మరో పక్క‌ ఖమ్మం టీఆర్ఎస్ లో విభేధాలు భగ్గుమంటున్నాయి.అక్కడ గెలిచిన ఎమ్మెల్యే.. ఆయనపై ఓడిన మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోకల్‌ ఎలక్షన్స్‌లలోనూ ఇద్దరి మధ్య ఆధిపత్యపోరే నడిచింది. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే సీన్‌ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏకంగా మాజీ ఎమ్మెల్యే వర్గం ప్రత్యర్దికి మద్దతిస్తుంది.


ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో సొంత పార్టీ నేతల తీరు ఒక పట్టాన అంతుబట్టడం లేదట. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కాకుండా.. ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో జతకట్టిందట. దీంతో స్థానికంగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు మరో లెవల్‌కు వెళ్లిందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య సమన్వయం కుదిర్చేందుకు ఇటీవల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత పరిస్థితి మెరుగుపడిందని అంతా భావించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి నాయకులు పాల్గొంటున్నారు కూడా. తమకు పడని నాయకులతో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేని వారు సైతం విడిగానే పల్లాకు ఓటేయాలని ప్రచారం చేస్తున్న పరిస్థితి. కానీ… కొత్తగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు పార్టీ పెద్దలకు అంతుబట్టడం లేదు.

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిర్వహించిన సమన్వయ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రాలేదు. పార్టీ తనను పట్టించుకోవడం లేదని చెబుతూ దూరంగా ఉంటున్నారు. కిందటి ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావును టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పటి నుంచి జలగం వర్గం గుర్రుగా ఉంటోంది. వనమా, జలగం వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితులు లేవు. ఇప్పుడు వీరంతా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి కాకుండా.. ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారట.

పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవ జోక్యం చేసుకున్నా సమస్య కొలిక్కి రాలేదట. జలగం వర్గంగా ముద్రపడిన స్థానిక ప్రజాప్రతినిధులను వనమా అనుచరులు ఇబ్బంది పెడుతున్నారట. దాంతో రెండు శిబిరాల మధ్య సయోధ్య కష్టమన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. కేవలం ఎమ్మెల్యే వనమా మీద ఉన్న కోపంతోనే పల్లాను కాదని ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను భుజనా కెత్తుకున్నారని చెబుతున్నారు. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news