స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకున్న గేమ్స్‌లో ‘క్యాండీ క్రష్ సాగా’ కూడా ఒకటి. దీన్ని చాలా మంది విపరీతంగా ఆడుతారు. అయితే ఈ గేమ్‌ను డెవలప్ చేసిన కింగ్ కంపెనీ ఈ గేమ్ ప్రియులకు శుభవార్త చెప్పింది. క్యాండీ క్రష్ సాగాతోపాటు కింగ్ డెవలప్ చేసిన పలు ఇతర గేమ్స్‌లోనూ ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్‌లిమిటెడ్ లైవ్స్‌తో ఈ గేమ్స్‌ను ఆడుకోవచ్చని.. ఆ కంపెనీ తెలియజేసింది. ఈ మేరకు కింగ్ కంపెనీ తాజాగా ట్వీట్ చేసింది.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలను ఇళ్లలోనే ఉంచేందుకు.. వారికి కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకే.. ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని కింగ్ తెలిపింది. ఇందులో భాగంగానే తాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో)తో భాగస్వామ్యం అయ్యామని కింగ్ తెలియజేసింది. ఈ క్రమంలో క్యాండీ క్రష్ తోపాటు క్యాండీ క్రష్ సోడా సాగా, క్యాండీ క్రష్ ఫ్రెండ్స్ సాగా, క్యాండీ క్రష్ జెల్లీ సాగా, బబుల్ విచ్ 3 సాగా, పెట్ రెస్క్యూ సాగా, ఫాం హీరోస్ సాగా.. తదితర గేమ్స్‌లోనూ ఏప్రిల్ 5వ తేదీ వరకు యూజర్లకు అన్‌లిమిటెడ్ లైవ్స్ లభిస్తాయి. దీంతో యూజర్లు తమకు కేటాయించిన పరిమిత లైవ్స్ అయిపోయినప్పటికీ ఎన్ని సార్లయినా గేమ్స్‌ను ఆడుకోవచ్చని కింగ్ తెలియజేసింది.
కాగా ఇప్పటికే కింగ్ సంస్థతోపాటు యాక్టివిజన్ బ్లిజర్డ్, అమెజాన్ యాప్ స్టోర్, బిగ్ ఫిష్ గేమ్స్, గ్లూ మొబైల్, యూనిటీ, జింగా, రియొట్ గేమ్స్ తదితర ఇతర గేమింగ్ సంస్థలు కూడా ప్లే అపార్ట్ టుగెదర్ అనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై.. తమ యూజర్లకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నాయి. అలాగే లాక్‌డౌన్ సమయంలో యూజర్లకు పలు క్విజ్‌లు, కాంటెస్ట్ లు నిర్వహిస్తూ.. పలు ఆఫర్లు, రివార్డులను కూడా ఆయా సంస్థలు వారికి అందిస్తున్నాయి.