సాగు చట్టాలపై పెద్ద ఎత్తున పోరుకు సిద్ధమవుతున్న రైతు సంఘాలు.. భారత్ బంద్ కు పిలుపు

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ జాతీయ కిసాన్ మోర్చా నిరసన కార్యక్రమం చేపడుతున్న సంగతి తెలిసిందే. సాగు చట్టాల వల్ల రైతులకు జరిగే లాభం ఏమీ లేదని, వాటివల్ల వ్యాపారుల వద్ద రైతు, బానిసగా మారతాడని, అందువల్ల వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని ఎన్నో రోజులుగా నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఐతే ప్రస్తుతం ఈ నిరసనలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. సాగు చట్టాలపై రైతుల ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు జాతీయ కిసాన్ మోర్చ సిద్ధమైంది.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన మహా పంచాయత్ కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి 15రాష్ట్రాల నుండి 300రైతు సంఘాల ప్రతినిధులతో పాటు అనేక మంది రైతులు పాల్గొన్నారని తెలుస్తుంది. ఐతే సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నెల 25వ తేదీన భారత్ బంద్ కు కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చింది. రైతులకు ఉపయోగపడని సాగు చట్టాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది.