కేసీఆర్ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్ పాలనపై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాను మూడుసార్లు ఎమ్మెల్యే అవుతానని, కేంద్ర మంత్రి అవుతానని అనుకోలేదని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ ఇక రోజులు లెక్కబెట్టుకోవాలని, మీ కుటుంబాన్ని ఇక ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామని హెచ్చరించారు. మీ కుటుంబానికి బానిసలం కాదన్నారు. నిజాం భవనాలను తలపించేలా ప్రగతి భవన్ కట్టుకున్నారని ధ్వజమెత్తారు. పేద ప్రజల ఇళ్ల కోసం మాత్రం స్థలం, నిధులు ఉండవన్నారు.
మరోపక్క, ఇటీవల ఏర్పడిన I-N-D-I-A కూటమిపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రతిపక్ష పార్టీలలో ప్రధానమంత్రి ఎవరు అవుతారో తెలియదన్నారు. ఆ కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకో ప్రధానమంత్రి మారుతారని ఎద్దేవా చేశారు. ఎవరినీ ఆ కుర్చీలో కూర్చోనివ్వరని, ఒకరు కాలు పట్టి గుంజితే, మరొకరు చేయిపట్టి లాగుతారన్నారు. ప్రజలు సమర్థవంతమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.