తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అడవుల పెంపకం కోసం ” కాంపెన్ సెటరి అఫారెస్టేషన్ ఫండ్” (CAMPA) క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగ పరుచుకోవడం లేదని లేఖ రాశారు కిషన్ రెడ్డి. వన్యప్రాణుల సంరక్షణలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన నిధులను గురించి కెసిఆర్ కి లేఖ రాశారు.
” ప్రకృతిని పరిరక్షించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఎన్నో రకాల వన్యప్రాణులకు, ప్రత్యేకమైన ఉత్పత్తులకు, ఔషధ మూలికలకు, గిరిజన ప్రజలు తదితరాలకు ఆవాసాలుగా ఉన్న అడవులు ఈ ప్రకృతిలో ఒక భాగం. కాలానుగుణంగా ఉత్పన్నమయ్యే మానవ అవసరాల కొద్ది చేపడుతున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కొన్ని ప్రాంతాలలో ఈ అడవులను ఉపయోగించుకోవలసి వస్తుంది. అలాంటి సమయంలో కొంత అటవీ విస్తీర్ణాన్ని కోల్పోవలసి వస్తుంది. తద్వారా ఈ అడవుల మీద ఆధారపడి ఉన్న ఎన్నో రకాల ప్రాణులకు ఇబ్బంది కలగడమే కాకుండా.. ప్రకృతిక విపత్తులు సంభవించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన కోల్పోయిన విస్తీర్ణాన్ని ప్రత్యామ్నాయంగా పెంచాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 3,110 కోట్ల నిధులను 2019 – 2020 లో విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఆమోదం తెలిపినా.. రాష్ట్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలకు అనుగుణంగా ఆ నిధులను వినియోగించుకోవలసి ఉంటుంది ” అంటూ లేఖలో పేర్కొన్నారు.
అడవుల పెంపకం కోసం ‘కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్’ (CAMPA) క్రింద కేంద్ర ప్రభుత్వం విడుదలచేస్తున్న నిధులను సద్వినియోగ పరుచుకోవడం, వన్యప్రాణుల సంరక్షణలో కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రాష్ట్రప్రభుత్వం తన వాటాగా విడుదల చేయవలసిన నిధులను గురించి KCR గారికి లేఖను వ్రాశాను. pic.twitter.com/JsIDvHfT7v
— G Kishan Reddy (@kishanreddybjp) April 17, 2023