ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందిన వేడి అలా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రత్యేకించి కృష్ణా – గుంటూరు – విశాఖ నేతలపై ఒత్తిడి ఎక్కువగా ఉందనే కథనాలు వస్తోన్నాయి. ఈ క్రమంలో గుడివాడ నియోజకవర్గానికి చెందిన కొడాలి నాని స్పందించారు. తాజాగా ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… అమరావతి నుంచి పూర్తిస్థాయి రాజధానిని తొలగించడం, స్థానిక నేతలపై ఒత్తిడు ఉందనడంపై తనదైన క్లారిటీ ఇచ్చారు.
తనది గుడివాడ నియోజకవర్గం అని మొదలుపెట్టిన నాని… ఇక్కడ నుంచి రాజధానిని పూర్తిగా తరలించడం లేదన్న విషయం అంతా గుర్తుంచుకోవాలని అంటున్నారు. అయితే… అమరావతి నుంచి పరిపాలనా రాజధాని, హైకోర్టులను తరలించడం వల్ల ప్రజలకు నష్టం ఏమీ లేదని… తనను ఎన్నికల్లో గెలిపించింది, అమరావతి కోసం కాదని.. అభివృద్ధి కోసమని అన్నారు!
ఈ విషయాలపై మరింత క్లారిటీ ఇచ్చిన నాని… ఊరిలో రోడ్లు బాగుచేయగలడా.. తాగునీరు, సాగునీరు అందించగలడా.. ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలడా.. అని చూసి ఓట్లు వేశారు, వేస్తారే తప్ప… రాజధానిని అమరావతిలో కడతారా, విజయవాడలో కడతారా, విశాఖలో కడతారా అనే ప్రాతిపదికన ఓట్లు వేయరని స్పష్టం చేశారు! రాబోయే ఎన్నికల నాటికి అమరావతి – రాజధాని – విశాఖ వంటి విషయాలేమీ ప్రాతిపధికలు కావని, కేవలం అభివృద్ధి – సంక్షేమం మాత్రమే ప్రాతిపధికలుగా ఉంటాయని అంటున్నారు నాని!! అధినేత తీసుకున్న నిర్ణయంపై నమ్మకం అంటే అలా ఉండాలి మరి!!