జో రూట్ వికెట్ తీశాక కోహ్లి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో చూడండి..!

-

టీమిండియా క్రికెట్ కెప్టెన్, బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి మ్యాచ్‌లలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తాడో అందరికీ తెలిసిందే. వికెట్ తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు లేదా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పలు ప్రత్యేక సందర్భాల్లో కోహ్లి తన అచీవ్‌మెంట్‌ను వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఆ మాటకొస్తే ప్రతి ఒక్క క్రికెట్ ఆటగాడికి ఒక్కో శైలి ఉంటుంది. అందులో భాగంగానే కోహ్లి కూడా నిన్న జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో ఆ విషయం కాస్తా ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.

టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం విదితమే. ఆ దేశంతో ఆడిన భారత్ మొదట టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. అందులో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ నిన్న ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఉన్న ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభమైంది. అయితే తొలి రోజు తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ నిన్న ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి గాను 285 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్, జానీ బెయిర్‌స్టోలు 4వ వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అప్పుడు జో రూట్ 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆడుతుండగా అతను కొట్టిన బంతి కోహ్లి వైపు వచ్చింది. వెంటనే కోహ్లి బంతిని వేగంగా వికెట్ల వైపు విసిరాడు. అయితే అప్పటికి జో రూట్ ఇంకా క్రీజుకు చేరుకోకపోవడంతో అతను రనౌట్ అయ్యాడు. దీంతో కోహ్లి జో రూట్ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. గాల్లోకి ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ సెలబ్రేట్ చేసుకునే సరికి ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌లో జో రూట్ కూడా భారత్‌పై మ్యాచ్ గెలిచిన సందర్భంగా భారత ఆటగాళ్లను కించ పరిచేలా తమ టీం విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో జో రూట్‌ను తమ టీం మేనేజ్‌మెంట్ మందలించింది. అయితే అందుకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఇప్పుడు కోహ్లి జో రూట్ వికెట్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు. కాగా కోహ్లి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం భారత అభిమానుల్లోనూ ఆనందం నింపుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news