అబుధాబి వేదికగా ఆదివారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 35వ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అయితే అందులో హైదరాబాద్ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా కోల్‌కతా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 163 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాట్స్మెన్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. కానీ స్కోరు బోర్డును కొంత సేపు ముందుకు కదలించే ప్రయత్నం చేశారు. ఓపెనర్ శుబమన్ గిల్ 37 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేయగా, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు. అలాగే చివర్లో దినేష్ కార్తీక్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 14 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది.
హైదరాబాద్ బౌలర్లు ఆరంభం నుంచి కోల్‌కతా బ్యాట్స్‌మెన్ ను పరుగులు తీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారు ఆ ప్రక్రియలో విజయం సాధించారు. అయినప్పటికీ చివర్లో కోల్‌కతా బ్యాట్స్‌మెన్ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, బెసిల్ థంపి, వి.శంకర్, రషీద్ ఖాన్లు తలా 1 వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కెప్టెన్ వార్నర్, జానీ బెయిర్ స్టోలు మాత్రమే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. 33 బంతులు ఆడిన వార్నర్ 5 ఫోర్లతో 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 28 బంతుల్లో 7 ఫోర్లతో జానీ బెయిర్ స్టో 36 పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గుసన్ 3 వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమ్మిన్స్, శివం మావి, వరుణ్‌లు తలా 1 వికెట్ తీశారు.