తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ముదరుతున్నాయి. మొన్నటికి మొన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై సొంత పార్టీ నేతలే మండిపడ్డారు. అయితే.. తాజాగా.. మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థిని ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సోమవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టి హైదరాబాద్ తిరిగి వచ్చేసిన పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాసేపటి క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరిన వెంటనే పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన ఓ లేఖ రాశారు. ఆ లేఖను మీడియాకు విడుదల చేసిన ఆయన…లేఖలో ప్రస్తావించిన అంశాలను వెల్లడించారు.
రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో కాంగ్రెస్ నాశనమైందని సదరు లేఖలో తాను సోనియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోమవారం నాటి ఏఐసీసీ సమావేశానికి హాజరు కాకపోవడానికి గల కారణాలను లేఖలో ప్రస్తావించినట్లు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఎంపీగా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ తరహా చర్యలతో తనను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీగా ఉన్న మాణిక్కం ఠాగూర్ దొంగ నాటకాలాడుతున్నారని కూడా సోనియాకు ఫిర్యాదు చేసినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.