మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘అంజి’. భారీ అంచనాల మధ్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్లో హాలీవుడ్ సినిమాను తలపించే గ్రాఫిక్స్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. దాదాపు ఐదేళ్లకు పైగా షూటింగ్ జరుపుకొందీ చిత్రం. కాగా, ఇందులో విరామ సన్నివేశాలను నెలరోజుల పాటు తీసినట్లు దర్శకుడు కోడి రామకృష్ణ ఓ సందర్భంలో చెప్పారు.
“ఇంటర్వెల్ సీన్ నెల రోజులు తీశాం. చిరంజీవి కూడా ఓపిగ్గా చేశారు. కేవలం గ్రాఫిక్స్ మాత్రమే కాదు. కథ పరంగా అదొక క్లిష్టమైన సబ్జెక్ట్. అందులో చిరంజీవిగారిని ‘ఒరేయ్’ అనే పాత్ర ఉంది. ఆయన్ను అలా పిలిచే వ్యక్తిగా ఎవరు సరిపోతారా? అని వెతికాం. చివరికి నాగబాబుగారిని వేషం వేసి పెద్దయ్య పాత్ర ఇచ్చాం. సినిమాకు సంబంధించిన వర్క్ కూడా చాలా పెద్దది. కొన్ని సన్నివేశాలకు 100 నుంచి 120 షాట్స్ తీయాల్సి వచ్చేది. అలా తీయబట్టే దానికి ఐదేళ్లు పట్టింది. శ్యాంగారు చాలా ఖర్చు పెట్టి సినిమా తీశారు. దీంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ సినిమాకు పని చేస్తుంటే తల తిరిగిపోయేది. ఎందుకంటే గ్రాఫిక్స్‌వర్క్ సింగపూర్, మలేషియా, అమెరికాల్లో జరిగేది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తీసిన షాట్స్ అన్నీ రాత్రికి అమెరికా పంపేవాళ్లం. మరుసటి రోజు ఆ డిస్క్‌లోని షాట్స్ వాళ్లు తీసుకుని మళ్లీ అదే రోజు ఆ డిస్క్‌లను ఇక్కడికి పంపేవాళ్లు” అంటూ చెప్పుకొచ్చారు కోడి రామకృష్ణ.
అయితే ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం చిరంజీవి డ్రెస్‌కు మార్కులు పెట్టేవాళ్లు. ఆయన రోజూ అదే డ్రెస్ వేసుకునే వారు. కనీసం ఉతకడానికి కూడా ఉండేది కాదు. అలా రెండేళ్లు అదే కాస్ట్యూమ్‌ను కొనసాగించారట. ఈ విషయాన్ని దర్శకుడు కోడిరామకృష్ణ ఓ సందర్భంలో తెలిపారు.
ఇంకా ఈ సినిమాలో చిరంజీవి ఓ బిచ్చగాడికి అవకాశం ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వద్ద అడుక్కునే వ్యక్తికి ఈ సినిమాలో మాంత్రికుడి వేషం దక్కింది. ఈ చిత్రంలో నాయకానాయికలు, ప్రతినాయకుడు తప్ప మిగిలిన వాళ్లంతా కొత్తవాళ్లే. ఒకవేళ ఆ ఐదేళ్లలో ఎవరైనా చేయకపోతే అదే పోలికలున్న వ్యక్తిని ఎంపిక చేద్దామనుకున్నారట రామకృష్ణ. ఇలా మరొకరు నటించాల్సిన మాంత్రికుడు పాత్రలో బిచ్చగాడు ఎంపికయ్యాడు. సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే మాంత్రికుడే ఈయన.