పేరు మార్పుతో జీవితం మారదు కానీ మహనీయుని స్మరణ అన్నది రాజకీయాలకు అతీతంగా సాగితే మేలు అన్నది ఓ నిర్థిష్ట అభిప్రాయంగా వినిపిస్తోంది. కొత్త జిల్లాల పేరుతో ఇప్పటికే ఎటూ కాకుండా ఎటూ తేల్చకుండా ఉంచేసిన చాలా చాలా ఖాళీలు భర్తీ చేసి, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అన్నవి దళితులకు (నిబంధనల మేరకు..న్యాయ సూత్రాలు అనుసరించి) చేస్తే ఎంతో మేలు అని, అలా కాకుండా పేర్లు మార్చి, ఓ గొప్ప మార్పునకు తామే ప్రతినిధులం అని చెప్పుకోవడం మాత్రం సబబుగా లేదని, నిర్హేతుకంగా ఉందని కొందరు దళిత సంఘాల నాయకులు ఆవేదన చెందుతున్నారు. ఇంకొందరు మాత్రం ఇదే సమయంలో స్వాగతిస్తూ సంబరాలు చేస్తున్నారు. అధికార, విపక్ష వాదనలు ఎలా ఉన్నా పేరు మార్పుతోనే మంచి ఫలితాలు అనిచెప్పడం, ఆ విధంగా మభ్యపెట్టడం అన్నవి చాలా అంటే చాలా తప్పు. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమౌతున్నాయో తెలియడం లేదు. ఆర్థిక స్వతంత్రత అన్నది ప్రభుత్వాలు దళితలకు కల్పించడం లేదు అన్నది ఎప్పటి నుంచో ఉన్న విషాదం. ఇవేవీ మాట్లాడకుండా మంత్రులు వాస్తవాలు దాచేయ్యడం అన్నది తప్పుల్లో కెల్లా తప్పు.. అన్న వాదన కూడా సోషల్ మీడియా నుంచి, ఇతర యాక్టివిస్టుల నుంచి వినిపిస్తోంది.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును కొత్తగా ప్రతిపాదించిన కోనసీమ జిల్లాకు పెట్టడం పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందాల కోనసీమకు ఆ పేరే బాగుందని, ఇరవై ఏళ్లకోసారి రిజర్వేషన్లు మారిపోయేటప్పుడు ఎందుకని అంబేద్కర్ పేరు పెడతారని గంగలకుర్రు అగ్రహారం వాస్తవ్యులు అభ్యంతరాలు చెబుతున్నారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకునే అవకాశం ఉంది. ఇక్కడి రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం అంబేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడాన్ని సమర్థిస్తున్నారు. ఈ విషయమై ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. అయితే దీనిపై పలు వాదనలు వస్తున్నాయి. రాజ్యాధికారం అన్నది దళితులకు దక్కకుండా చేస్తున్న పాలక వర్గాలు కేవలం పేర్లు పెట్టి, పొలిటికల్ మైలేజీ పొందుతున్నారని కొన్ని దళిత సంఘాలు మండిపడుతున్నాయి. వీటి కారణంగానే తమ ఎదుగుదల సాధ్యం అవుతుందని, ఆధిపత్యాన్ని నిలువరించలేనప్పుడు తామేం సాధించామన్నది తమకే తెలియకుండా పోతున్నప్పుడు ఇలాంటివి ఏ పాటి ఆనందాన్నీ ఇవ్వవు అని బాధపడుతున్నారు.
ప్రకృతి అందాలతో అలరారే కోనసీమ ప్రాంతానికి ఆ ప్రాంతంతో ఏర్పడ్డ కొత్త జిల్లాకు అంబేద్కర్ పేరు ఉంచినంత మాత్రాన ఈ ప్రాంత దళితులకు కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని అంటున్నారు కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఎందుకంటే దశాబ్దాలుగా తాము వెనుకబాటు తనాన్ని అనుభవిస్తూ ఉన్నామని, దానిని తరిమికొట్టేందుకు ప్రభుత్వాలు పనిచేయడం లేదని,
కేవలం కంటి తుడుపు చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, అవే ప్రథమావధిగానూ, పరమావధిగానూ మారుతున్నాయని చెబుతున్నారు వీళ్లంతా !