హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ తర్వాత తెలంగాణలో మరో కొత్త పార్టీపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందని కొండా తెలిపారు. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం ఉండాల్సిందేనని చెప్పారు. మాజీ మంత్రి ఈటలతో కలిసి తాను కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలస్తోంది. ఇప్పటికే ఆ వైపు నుంచి కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లోని అసంతృప్తులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు తమతో టచ్‌లో ఉన్నారని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న రేవంత్ గురించి ఆయన ప్రస్తావించారు. రేవంత్ తెలంగాణలో పెద్ద నేతని, తమకు ఆయన మద్దతిస్తారని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఈటలను కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి కలిశారు. ఈటల తనకు బంధువని పేర్కొన్నారు. తాజాగా కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇద్దరు కలిసి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారానికి తెరదించాయి.
మరోవైపు ఈటలకు మద్దతు పెరుగుతోంది. ఈటలను టీఆర్ఎస్ మోసం చేసిందని పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. తెలంగాణలోని పలువురు ఉద్యమకారులు, టీఆర్ఎస్ నేతలు, మాజీ లీడర్లు ఇప్పటికే ఈటలను కలుస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట మండలాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు.. ఈటలకు మద్దతు పలికారు. టీఆర్ఎస్ అధిష్టానం వేసే అడుగులను బట్టి ఈటల వ్యూహం ఉంటుందని అంటున్నారు.