ఆంధ్రప్రదేశ్ రాజధానుల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటన ఎవరిని ఇబ్బంది పెట్టిందో ఏమో గాని, తెలుగుదేశం పార్టీకి మాత్రం చుక్కలు చూపిస్తుంది. అసలు ఎం చెయ్యాలో అర్ధం కాక ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నేతలను అదుపు చేయలేక కనీసం తాను ఎటు మద్దతు ఇవ్వాలో అర్ధం కాక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నట్టే కనపడుతుంది. ఇక పార్టీలో నేతలు మాత్రం ప్రాంతానికో అభిప్రాయం ఎక్కువగా వినిపించడం ఇప్పుడు ఇబ్బందికర వాతావరణం.
ఈ ప్రభావంతో కొందరు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. కర్నూలుకి చెందిన కేయీ కృష్ణమూర్తి, విశాఖ జిల్లా ఉత్తరం ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి పార్టీని వీడే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొండ్రు మురళి విషయంలో బలంగా వార్తలు వినపడుతున్నాయి. జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన కొండ్రు మురళి, ఈ విషయంలో తమ పార్టీ అధినేత చంద్రబాబుని కూడా ఒప్పిస్తామని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ప్రభుత్వంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేసారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆయనకు చంద్రబాబు మంచి ప్రాధాన్యతే ఇచ్చారు. బలమైన నేతగా గుర్తింపు ఉండటంతో పార్టీ సీనియర్ నేత ప్రతిభా భారతిని కూడా చంద్రబాబు పక్కన పెట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు జగన్ రాజధాని నిర్ణయంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆయన పార్టీని వీడితే మాత్రం ఉత్తరాంధ్ర లో బలమైన నేతను తెలుగుదేశం కోల్పోయినట్లే.