10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ ఇచ్చారో కొప్పుల ఈశ్వర్ చెప్పాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు.ధర్మపురి నియోజకవర్గం లోని పెగడపల్లిలో పెద్దపల్లి లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ… రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ. 70 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేశారని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పథకంతో ఎవరికి నీరు అందలేదన్న వివేక్… రూ. 40 వేల కోట్లు వృధా అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
రామగుండంలో కొప్పులను ప్రజలు నిలదీస్తున్నారన్నారు వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న కొప్పుల కమిషన్లు మింగాడని విమర్శించారు. కొప్పుల కనీసం జూనియర్, డిగ్రీ కాలేజీలు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీలో ఇప్పటికే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని .. . ఫ్రీ బస్సుతో మహిళలకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.