ఎన్టీఆర్ అభిమానులు, ఆయన్ని విమర్శించేవారు కూడా “మండలాదీశుడు” సినిమాని మర్చిపోలేరు. ఎన్టీఆర్ పై, ఆయన పాలనపై అదో పొలిటికల్ సెటైర్. ఎన్టీఆర్ హయాంలో.. ఎన్టీఆర్ ని విమర్శిస్తూ, సెటైరికల్ సినిమా తీయడం అప్పట్లో నిజంగా గొప్ప సాహసం. ఆ సాహసం ఎన్టీఆర్ పాత్రలో కోట శ్రీనివాసరావుదే అనడంలో సందేహం ఉండకపోవచ్చు! అది కూడా కొంతమంది బలవంతతోనే చేశానని ఆయన తర్వాతి కాలంలో బహిరంగంగనే చెప్పారు కూడా! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా “తెలంగాణ ముఖ్యమంత్రి” పాత్రలో నటిస్తున్నారు కోట శ్రీనివాస రావు!
అవును… దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా నటుడిగా తనదైన మార్కును క్రియేట్ చేసిన విలక్షణ నటుడు కోటశ్రీనివాస రావు… పలు చిత్రాల్లో రాజకీయ నాయకుడి పాత్రధారిగా మెప్పించిన సంగతి తెలిసిందే. “గణేష్” సినిమాలో పాత్ర ఇందుకు మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఆయన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి పాత్రలో “రొరి” చిత్రంలో నటిస్తున్నారు.
జూలై 10 కోట శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా “రొరి” చిత్ర యూనిట్ సినిమాలోని ఆయన లుక్ ను విడుదల చేసింది. దీంతో… ఈ సినిమా రాజకియంగా మరో సంచలనం అవుతుందా లేక సాదాసీదాగానే ఉంటుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇక సినిమా విషయానికొస్తే.. సినిమాలో ఆయన పాత్ర పేరు “ఆర్. రామన్న చౌదరి”! ఈ చిత్రాన్ని సీటీఎస్ స్టూడియోస్, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంయుక్తంగా చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు!