తెలంగాణకు పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా.. 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హెచ్ఐసీసీలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ మొబిలిటీ వీక్‌లో భాగంగా రెండో రోజు జరిగిన ఈవీ సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా బాష్ వంటి పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
సోలార్ ఎనర్జీలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేటీఆర్ అన్నారు. ఆటోమోటివ్ సొల్యూషన్స్‌లో హైదరాబాద్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే ఈవీ-ఈఎస్‌ఎస్-2020 పథకంపైనా దృష్టి సారించామని చెప్పారు. దీని ద్వారా విద్యుత్ వాహనాలు, బ్యాటరీ తయారీ కోసం పెట్టుబడులు సులభతరం చేసి.. రాష్ట్రంలో ఈవీల సంఖ్య పెరిగే విధంగా చేయడం.. ఛార్జింగ్ స్టేషన్‌లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. దేశంలో మొట్టమొదటి న్యూ మొబిలిటీ ఫోకస్ క్లస్టర్.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని ప్రకటిస్తున్నామన్న ఆయన.. దీని ద్వారా ఈ రంగంలో తెలంగాణను తయారీ, పరిశోధనలకు సంబంధించి మంచి మౌలిక వసతులతో గమ్యస్థానంగా మార్చనున్నామని స్పష్టం చేశారు.