హైదరాబాద్ మహా నగరంలో మరో నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఎల్బీ నగర్ పరిధిలోని ఫతుల్లాగూడలో 500 టన్నుల సామర్ధ్యంతో ఈ నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.వైట్ ప్రాసెసింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్లాంట్ పనిచేయనుంది.
ఇప్పటకే నగరంలో జీడిమెట్లలో 500 టన్నుల సామర్థ్యంతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రీసైక్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించగా… తాజాగా నగరంలో మరో ప్లాంట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్లాంట్ ద్వారా నిత్యం 500 టన్నుల వ్యర్ధాలను రీసైక్లింగ్ చేస్తారు. దీంతో నగరంలో రోజుకు వెయ్యి టన్నుల నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ జరుగుతున్నట్లు అయింది. ఇక రీసైక్లింగ్ ద్వారా వచ్చిన సన్న ఇసుక, దొడ్డు ఇసుక, కంకర, రాయి, ఇటుకలను వేరుచేసి వాటితో పేవర్ బ్లాక్స్, పార్కింగ్ టైల్స్, ఫుట్ పాత్ టైల్స్ వంటివి తయారు చేస్తారు.
ప్లాంట్‌ను ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దేశంలో ఢిల్లీ, అహ్మదాబాద్ తర్వాత హైదరాబాద్‌లోనే సీ అండ్ డీ ప్లాంట్ ఉన్నట్లు వివరించారు. సమగ్ర ప్రణాళికతో వ్యర్థాల నిర్వహణ చేపడుతున్నట్లు చెప్పారు. వరంగల్, ఇతర పట్టణాల్లో క్లస్టర్ల తరహాలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొడి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.