ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన మంత్రి.. సెస్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ప్రసంగించారు. ఈ సందర్భంలో మోదీపై, కేంద్ర సర్కార్ తీరుపై, బీజేపీ నాయకులపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
‘మోదీ దేవుడన్నా’ అంటున్న వాళ్లు.. ఆయన ఎవరికి దేవుడో చెప్పాలని మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. దేవుడని అన్న వ్యక్తికా.. గుజరాత్ వారికా అని నిలదీశారు. ‘రూ.400 ఉన్న సిలిండర్ ధర రూ.వెయ్యి దాటించినందుకా? రూ.70 ఉన్న పెట్రోల్ ధరను రూ.110 చేసినందుకా? 13 నెలల పాటు దిల్లీలో ఆందోళన చేసిన రైతులను కొట్టించినందుకా.. 700 మంది రైతుల మరణాలకు కారణమైనందుకా? గిరిజనుల రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతం పెంచాలనే ప్రతిపాదనను పట్టించుకోనందుకా..’? మోదీ ఎందుకు దేవుడో చెప్పాలని బీజేపీ నాయకుల్ని డిమాండ్ చేశారు.