తెలంగాణపై కోపంతో కేంద్రం దేశం కడుపు మాడుస్తోంది : కేటీఆర్

-

తెలంగాణపై వివక్షతో కేంద్రం దేశం కడుపు మాడుస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో దేశంలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడిందని  విమర్శించారు. రాష్ట్రం విఫలమైందని చూపే ప్రయత్నంలో మోదీ సర్కారు తాను తీసుకున్న గోతిలో తానే పడిందన్నారు. వివక్షతో తెలంగాణ ఆహార ధాన్యాలు కొనుగోలు చేయకుండా.. దేశ ప్రజల ఆహార భద్రతను కేంద్రం పణంగా పెట్టిందని విమర్శించారు. వన్‌ నేషన్‌ వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని అనుసరించాలని, రాష్ట్రంలో పండించిన పంటను కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానించిన పీయూష్ గోయల్‌ ఇప్పుడు నూకల ఎగుమతులను నిషేధించి వాటినే తింటారేమోనని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. యాసంగిలో బాయిల్డ్‌ రైస్‌ తీసుకోమంటూ మోదీ సర్కారు కొర్రీలు పెట్టడంతో తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రైతులు వరి వేయకుండా ఇతర పంటల వైపు మళ్లించాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చిందని కేటీఆర్‌ ఆరోపించారు.

కేంద్రం తన విధానాలు మార్చుకొని ప్రజల సంక్షేమం, ఆహార భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి వివక్ష లేని నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణ వంటి రాష్ట్రాల నుంచి పూర్తిస్థాయి ధాన్యాన్ని సేకరించి దేశ ప్రజల ఆహార భద్రతకు ఢోకా లేకుండా చూడాలని పీయూష్ గోయల్‌ను కేటీఆర్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news