తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులపై మరోసారి విరుచుకుపడ్డారు. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరపడానికి రాష్ట్రానికి వస్తున్న కేంద్ర మంత్రులు.. కేంద్రం నుంచి పది వేల కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కానీ వాళ్లు అలా చేయరని.. ఉత్తిగా వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చి వెళ్లిపోతారని విమర్శించారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి ఎనిమిదేళ్లు గుర్తుకు రాని సెప్టెంబరు 17 ఈ రోజే గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.
“సిరిసిల్లకు మోగా పవర్‌లూం క్లస్టర్ కావాలని ఎనిమిదేళ్లుగా మొత్తుకుంటున్నా ఎలాంటి స్పందనా లేదు. నాలుగు ఓట్ల కోసం హిందూ, ముస్లిం పంచాయితీ పెడుతున్నారు. మనం సమైక్యతా దినోత్సవం అంటుంటే.. వాళ్లు మాత్రం కలిసి ఉండొద్దు అంటున్నారు.. పాత పుండ్లు తవ్వుకుని రాజకీయ పబ్బం చేసుకోవాలని చూస్తున్నారు. మా తాత కేశవరావును భారత ప్రభుత్వం సమరయోధునిగా గుర్తించి పింఛను మంజూరు చేసింది. మా కుటుంబానికి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉంది.. భాజపా నాయకులకు ఉందా..?” అని కేటీఆర్ ప్రశ్నించారు.