ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ పై పోరుబాట పట్టారు. కేంద్ర మెడలు వంచేలా ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కేంద్రం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. పంజాబ్ రాష్ట్రానికి ఓ నీతి, తెలంగాణకు ఓ నీతా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉగాది తరువాత ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు కేటీఆర్ ఉద్యమ, నిరసన కార్యక్రమాల కార్యచరణ ప్రకటించారు.
కేంద్రం వైఖరికి నిరసనగా ఈనెల 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసనల కార్యక్రమాలను ప్రకటించారు కేటీఆర్. రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొనాలని, నిరసన దీక్షలు అన్ని మండల కేంద్రాల్లో చేపట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. 6వ తేదీన నాలుగు ప్రధాన జాతీయ రహదారులు.. నాగ్‌పూర్, బెంగళూరు, ముంబై, విజయవాడ హైవేల దిగ్బంధం చేసి నిరసన కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. 7న 32 జిల్లాల కేంద్రాల్లో.. హైదరాబాద్ మినహా పెద్ద ఎత్తున మంత్రులు, శానససభ్యుల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు ఉంటాయని… 8న ప్రతీ గ్రామంలో రైతు ఇళ్లపై నల్లజెండాలు ఎగరవేయాలని పిలుపునిచ్చారు. 11వ తేదీన ఢిల్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, కార్పోరేషన్ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రజాప్రతినిధులు నిరసన తెలుపుతారని ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు కేటీఆర్.