కరోనా మహమ్మారి దేశాన్నే గజగజలాడిస్తుంది ఓ రకంగా చెప్పాలంటే విలయతాండవం చేస్తుంది. దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఈ మహమ్మారిని అంతం చేసేందుకు అహర్నిశలా కష్టపడుతున్నారు. అయితే హైదరబాద్ శాస్త్రవేత్తలు ఇంకొంత ముందంజలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే హైదరబాద్ కు చెందిన హెటిరో సంస్థ కోవిఫర్ 100 ఎంజీ పేరిట కరోనా ను కట్టడి చేసేందుకు ఇంజెక్షన్ రూపంలో ఓ మెడిసిన్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇక తాజాగా హైదరబాద్ కు చెందిన భారత్ బయోటిక్ సంస్థ కొవ్యాక్సిన్ పేరిట మరో మెడిసిన్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతుంది. ఇప్పుడు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మరో వార్తతో తెలంగాణ ప్రజలకు మరికొంత ఊరట కలిగించే విషయం వెల్లడించాడు.
కరోనా నివారణకు తయారయ్యే మందులతో పాటు వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచే రాబోతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. వైద్య, ఫార్మా రంగంలో హైదరబాద్ స్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీ పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం లోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరబాద్ లో ఫార్మా సిటీ రూపంలో కనిపించబోతుందని ఆయన తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఈ ఫార్మా సిటీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మాసిటీ ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యుత్తమ ప్రమాణాలతో హైదరాబాద్ ఫార్మా సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.