ఏపీపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు.. జగన్.. కమ్మ..మ‌ధ్య‌లో రేవంత్..

-

క్రెడాయ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఏపీ మంత్రులు కేటీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మా రాష్ట్రానికి వస్తే అభివృద్ధి చూపిస్తామని సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో..ఏపీలోని ప్రధాన విపక్షమైన టీడీపీ కేటీఆర్‌కు మద్దతుగా నిలుస్తోంది. మన రాష్ట్రం ఘనత పొరుగు రాష్ట్రానికి కూడా పాకిపోయింది చూశారా? అంటూ అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు.

అయితే.. మొన్నటి వరకు జగన్‌తో దోస్తీ చేసి.. ఆయనకు అండగా నిలిచి.. ఎన్నికల్లో గెలించేందుకు వైసీపీకి దోహదపడి.. టీడీపీని ఓడించాలని పిలుపునిచ్చి.. వెన్నంటి నిలిచిన టీఆర్‌ఎస్ వైఖరిలో ఒక్కసారిగా ఈ మార్పు ఎందుకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపనకు జగన్‌ను ఆహ్వానించి.. ప్రగతి భవన్ లో జగన్‌కు రాచమర్యాదలు చేసి.. ఎమ్మెల్యే రోజా ఇంట్లో విందు భోజనం ఆరగించి.. కరువుసీమ రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించిన కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ సడెన్ గా తన రూట్ ఎందుకు మార్చుకుంది? తెలంగాణ‌లో టీడీపీని నామ‌రూపాలు లేకుండా చేసిన కారు.. ఏపీలో ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చేలా ఎందుకు వ్య‌వహ‌రిస్తోంది?

ఏపీ ప్రభుత్వ పనితీరును విమర్శించడమంటే.. ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించడమే కదా? అయినా ఆ ధైర్యం కేటీఆర్ ఎందుకు చేశారు. దీని వెనుక ఏం మతలబు ఉంది? మొన్న ప్లీనరీలో జాతీయస్థాయిలో పార్టీ పెట్టే ఉద్దేశం ఉందని కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీలో తొలుత పాగా వేయాలనే ఉద్దేశం కేసీఆర్ లో మొదలయ్యిందా? అందుకే కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారా? అని కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అయితే..ఇది కూడా కాదని టీఆర్‌ఎస్ పెద్దలతో సన్నిహితంగా ఉండే నాయకులు అంతర్గతంగా పేర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ వ్యాఖ్యలను పరిశీలిస్తే అసలు విషయం బోధపడుతుందని అంటున్నారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఓ ఆసక్తికర అంశం వెల్లడయింద‌ని చెబుతున్నారు.

అందులో.. ఖ‌మ్మంలో బ‌ల‌మైన‌ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు క్రమక్రమంగా కారుకు దూరమవుతున్నారని తేలింది. వారంతా మాజీ టీడీపీ నేత, ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నార‌ట‌. ఇందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా అంతర్గతంగా ఖమ్మంలోని కమ్మ నేతలకు సూచనలు ఇస్తున్నార‌ట‌. వీరు ఇలా అసంతృప్తిగా ఉన్న స‌మ‌యంలో అగ్నికి వాయువు తోడ‌యిన‌ట్లుగా..ఏపీలో జగన్ కేబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేసిన త‌ర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. ఇది వారిని మ‌రింత ఆగ్ర‌హానికి గురిచేసింది.

దాంతో గతంలో వైసీపీకి, జగన్‌కు మద్దతు పలికిన కేసీఆర్ పట్ల ఖమ్మంలోని కమ్మ నాయకుల్లో వ్యతిరేకత మ‌రింత బ‌ల‌ప‌డుతోంది. ఇది గమనించే ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. కమ్మ నేతలందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు. ఏపీ కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదని. తెలంగాణలో తాను ఒక్కడినే మంత్రినని.. తనను కూడా పీకేయించేందుకు కుట్రలు చేస్తున్నారని వాపోయారు.

స‌ర్వే వివ‌రాల‌తో పాటు స్థానిక నాయ‌కులు, శ్రేణుల నుంచి న‌మ్మ‌ద‌గిన స‌మాచారం తెప్పించుకున్న త‌ర్వాతే కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇప్ప‌టికే అనేక మంది అసంతృప్త నేత‌ల‌కు ఫోన్లు చేసి బుజ్జ‌గిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కు దగ్గరవుతున్న కమ్మ సామాజిక వర్గాన్ని తిరిగి టీఆర్‌ఎస్ వైపుకు మళ్లించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

ఇందులో భాగంగానే ఏపీని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తద్వారా తాము జగన్ మద్దతుదారులం కాదనే సంకేతాన్నిఇచ్చారని, కమ్మ సామాజిక వర్గాన్ని సంతృప్తి ప‌ర్చేందుకే ఈ కామెంట్లు చేశార‌ని అంటున్నారు. అంతేగానీ.. కేటీఆర్, జగన్ మధ్య ఎలాంటి విరోధం లేదని.. ఉండబోదని కూడా అనడం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news