ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా క్రైసిస్ కమిటీ అని నిర్వచించారు కేటీఆర్. మొన్నటి వేళ రాహుల్ పర్యటన నేపథ్యంలో మరీ! ముఖ్యంగా వరంగల్-లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభ నిర్వహించిన అనంతరం, అది కాస్త అనూహ్య రీతిలో విజయవంతం అయిన వెంటనే చెప్పిన మాట ఇది. అప్పుడు రాహుల్ గాంధీ విషయమై కొంత అభద్రత భావంతో ఉన్నారని అనుకోవాలి. లేదా రాహుల్ గాంధీ తనకు పోటీగా వస్తున్నాడని కూడా అనుకోవాలి. అంతటితో ఆగక ఎంఐఎం (టీఆర్ఎస్ పార్టీ దోస్తు)తో కూడా ఓ స్టేట్మెంట్ ఇప్పించారు కేటీఆర్.
రాహుల్ గాంధీ దమ్ముంటే అటు హైద్రాబాద్ లో కానీ ఇటు మెదక్ లో కానీ పోటీ చేయాలని పెద్ద ఓవైసీ (అసరుద్దీన్ ఓవైసీ) తో స్టేట్మెంట్ ఇప్పించారు. సవాలు చేయించారు. తమ రెండు పార్టీలనూ అనే అర్హత రాహుల్ కు లేదని పెద్ద ఓవైసీ ఈ సందర్భంగా తేల్చేయడం ఇక్కడ ప్రస్తావనార్హం. అంటే ఆ రెండు పార్టీల మధ్య స్నేహం బాగానే ఉంది అని అనుకోవాలి.
- ఇక నిన్నమొన్నటి వేళ బీజేపీకి మరో నిర్వచనం ఇచ్చారు కేటీఆర్. బీజేపీ అంటే బేచో జనతా కీ ప్రాపర్టీ (ప్రజల ఆస్తులను అమ్మేసే పార్టీ) అని అభివర్ణిస్తూ కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చకు తావిస్తున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ హయాంలో బీఎస్ఎన్ఎల్ మొదలుకుని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వరకూ అన్నీ అమ్మేసేందుకు, తమ వారికి అవి అప్పగించేందుకు చర్యలు షురూ అయ్యాయి అని, అవన్నీ ప్రయివేటు వ్యక్తుల చేతికి చిక్కాయని పేర్కొంటూ కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు ఏపీకి చెందిన వైసీపీ నేతలు కానీ టీడీపీ నాయకులు కానీ చేయలేకపోతున్నారు.
ఓ విధంగా కేటీఆర్ మాట్లాడే మాటల్లో ఎన్నో నిజాలు ఉన్నా నిన్నటి దాకా బీజేపీకి అనుబంధ బాంధవ్యాలు కొనసాగించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నట్టుండి గేర్ మార్చడం అన్నదే ఆశ్చర్యకరంగా ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వాదన. ఇదే సమయంలో బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తావించాలి. ఆయన తెలంగాణ రాష్ట్ర్ర సమితిని తెలంగాణ రజకార్ల సమితి అని అభివర్ణించారు. ఈ విధంగా పరస్పర ఆరోపణల్లో భాగంగా ఆ రెండు పార్టీలు బాగానే ఆగమాగం అవుతున్నాయి. ఆ 2 పార్టీలంటే బీజేపీ మరియు తెలంగాణ రాష్ట్ర సమితి అని, ఇదే సందర్భంలో సీతక్కను కూడా కార్నర్ చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు మాట్లాడుతున్నాయి. ఏదేమయినప్పటికీ పొలిటికల్ హీట్ మాత్రం భలే జోరుగానే ఉంది.