తెలంగాణలో వరుసగా చిరుతలు దాడులు చేస్తూ కలకలం రేపుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని కొండాపూర్ గుడి తండాలో చిరుత కలకలం సృష్టించింది. మంగళవారం తండా సర్పంచ్ దేవిదాస్ కు చెందిన క్క అవుపై దాడి చేసి చంపింది. సర్పంచ్ చెబుతున్న వివరాల ప్రకారం ప్రతి రోజు మాదిరిగానే సర్పంచ్ తల్లి అవును అడవిలోకి తీసుకెళ్లింది. ఓ చోట కట్టేసి తన పనిలో నిమగ్నమైంది.
అడవిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన చిరుత ఆవు గొంతు పట్టుకుని దాడి చేసింది. అక్కడే ఉన్న గొర్ల కాపరులు కేకలు వేయగా అవును గుట్టపక్కకు లాక్కెళ్లిన చిరుత ఆవును చంపేసింది. గత నెలలో కూడా చిరుత ఓ దూడపై దాడి చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. చిరుత దాడితో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. చిరుత సంచారంతో ఆ ప్రాంత వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీని మీద అటవీ శాఖ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది.