నిన్నటి వరకు తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికల పై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. నిన్నటితో రెండు ఉప ఎన్నికల ఫలితాలు వెలువడడంతో… తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కాస్త సైలెంట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి మరోసారి ఎన్నికల సందడి ప్రారంభం కానుంది.
పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీలు, పలు జెడ్పిటిసి మరియు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇవాళ ప్రారంభం కానున్న నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది.
అలాగే ఈ నెల 14వ తేదీన పంచాయతీ, 15వ తేదీన మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలు అలాగే 16వ తేదీన ఎంపీటీసీ మరియు జెడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుంది. ఈ ఏడాది అక్టోబర్ 11వ తేదీ నాటి తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలను నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అటు ఆన్ లైన్లో నామినేషన్లు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి టీడీపీ వినతి ఇచ్చింది.