రంజుగా మారుతున్న ఏపీ పంచాయతీ ఎన్నికలు

-

పంచాయతీ ఎన్నికల వేళ..ఏపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్‌ఈసీ, సర్కార్‌..ఒకరిపై ఒకరు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగానే ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేశారు నిమ్మగడ్డ. మరోవైపు ఎస్‌ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని..సీఎస్‌ ఆదిత్యనాథ్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఊహించని ట్విస్టులతో ఏపీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, ప్రభుత్వం వ్యూహ ప్రతివ్యూహాలతో రక్తికట్టిస్తున్నారు. మొన్నటివరకు ప్రత్యక్ష యుద్ధం నడిచింది. మంత్రులు, వైసీపీ నేతలు ఎస్‌ఈసీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. ఉద్యోగ సంఘాలు సైతం..ఎస్‌ఈసీతో ఢీ అంటే ఢీ అన్నట్లు వ్యవహరించారు. సుప్రీం తీర్పు తర్వాత సీన్ మారింది. నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య పరోక్ష యుద్ధం సాగుతోంది.

పంచాయతీ రాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌లను సర్కార్‌ బదిలీ చేసింది. ఎస్‌ఈసీ సూచనల మేరకు బదిలీ చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. వారి స్థానాలను భర్తీ చేసేందుకు… ముగ్గురేసి అధికారుల జాబితాను ఎస్‌ఈసీకి పంపింది. ఇక్కడివరకు బాగానే ఉంది. తర్వాతే సీన్ మారిపోయింది. అధికారులను బదిలీచేయాలని ఎలాంటి సూచన చేయలేదంటూ ఎస్‌ఈసీ క్లారిటీ ఇచ్చారు. కొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయకుండా…ఇద్దరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రొసీడింగ్స్‌లో ప్రస్తావించారు.

ప్రభుత్వం ముందుగానే వారిని బదిలీచేస్తే వద్దన్న ఎస్‌ఈసీ… ఆ తర్వాత ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారన్నదే పెద్ద ట్విస్ట్‌. ఈ విషయంలోనే అటు ప్రభుత్వం ఇటు ఎస్‌ఈసీ ఎత్తుకు పైఎత్తు వేశాయనే చర్చ జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైతే ప్రభుత్వం సంసిద్ధత తెలిపిందో ఆ తర్వాత పరిణామాలను ముందుగానే అంచనా వేసింది. పంచాయతీరాజ్ అధికారులను బదిలీ చేయాలని సిఫార్సు చేస్తారన్న అంచనాతో ఆ మేరకు చర్యలు తీసుకుంది. ఈ కారణంగా వారి మీద రిమార్కులు రాసే అవకాశం ఉండదని భావించింది. దీన్ని ముందుగానే పసిగట్టిన ఎస్‌ఈసీ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కొంతసేపటికే చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

రిమార్కులు రాయడం వల్ల గోపాల కృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌ల ట్రాక్ రికార్డులపై మచ్చ ఏర్పడినట్టేనన్న చర్చ జరుగుతోంది.రానున్న నెల రోజుల్లో ఈ తరహా ఘటనలు మరెన్నో కన్పిస్తున్నాయనేది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news