కరోనా నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్డౌన్లను విధించి అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల్లోనూ లాక్డౌన్లను పొడిగిస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా లాక్డౌన్ను మే 30వ తేదీ వరకు పొడిగించింది. అయితే రాష్ట్రంలో మరోమారు లాక్డౌన్ను పొడిగిస్తారని తెలుస్తోంది. జూన్ 7వ తేదీ వరకు సీఎం కేసీఆర్ లాక్డౌన్ను పొడిగించేందుకు అవకాశం ఉన్నట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను పొడిగించాలని రాష్ట్ర ఆరోగ్య విభాగ అధికారులు ఇప్పటికే సీఎం కేసీఆర్కు ఓ నివేదికను అందజేశారు. మరో వారం పాటు లాక్డౌన్ను పొడిగిస్తే బాగుంటుందని వారు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 28వ తేదీన సీఎం కేసీఆర్ కోవిడ్ పరిస్థితిపై మరోసారు సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటారు. అయితే లాక్డౌన్ వల్ల కేసులు తగ్గుతున్న దృష్ట్యా మరో వారం పాటు దాన్ని పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
తెలంగాణలో మే 12వ తేదీ నుంచి లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్నారు. అయితే ప్రజలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని తెలియడంతో మరింత కఠినంగా నిబంధనలను అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో పోలీసులు అనవసరంగా బయటకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వారి వాహనాలను జప్తు చేస్తున్నారు. లాక్డౌన్ ముగిశాక కోర్టు ద్వారా ఆ వాహనాలను వాహనదారులు తీసుకోవచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే జూన్ 7 వరకు లాక్డౌన్ను పొడిగించినా, తరువాత ఏం చేస్తారు ? లాక్డౌన్ను ఎత్తేస్తారా ? మళ్లీ కొనసాగిస్తారా ? లేదా దశలవారీగా ఆంక్షలను సడలిస్తారా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.