ఏపీ హైకోర్టులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఊరట లభించింది. ఫైబర్ గ్రిడ్ టెండర్ల అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు కోసం లోకేష్ మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ తరఫు లాయర్ 41ఏ నోటీసు పేరుతో పిలిచి అందులోని నిబంధనలకు కట్టుబడలేదనే సాకుతో అరెస్టు చేసే ప్రమాదం ఉందని కోర్టుకు విన్నవించారు. 41ఏ(3)(4) నిబంధనలను ఒకేసారి సూచిస్తూ నోటీసు ఇస్తున్నారన్నారు. సమాచారం తీసుకురావాలని పోలీసులు కోరుతున్నారని.. నోటీసులోని అంశాలకు కట్టుబడలేదనే కారణం చూపుతూ అక్రమ అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. పిటిషనర్ తండ్రి చంద్రబాబు పేరును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అకస్మాత్తుగా చేర్చి ఒక్కసారిగా అరెస్టు చేశారన్నారు.
ఇది ఇలా ఉంటె, లోకేశ్ ఎల్లుండి (శుక్రవారం) రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తండ్రి అరెస్టైన రెండు రోజులకు ఢిల్లీకి వెళ్లిన లోకేశ్ అక్కడ న్యాయవాదులు, పలువురు నేతలతో వరుసగా భేటీ అయ్యారు. రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. ఎల్లుండి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిగే సమయానికి తిరిగి ఢిల్లీకి వెళ్లాలని లోకేశ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.