శ్రీ రాముడికి ప్రియ భక్తుడు, ఆ జన్మ బ్రహ్మ చారి అయిన ఆంజనేయుడు హిందువులు అందరికీ ఇష్ట దైవము. కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడు ని చూడగానే చిన్న, పెద్ద అందరిలో ఒక విధమైన ఉత్సాహం, ఉల్లాసం కలుగుతాయి. భక్తికి, సేవానిరతి కి మారు పేరుగా హనుమను వర్ణిస్తారు. అలాంటి ఆంజనేయుడికి ప్రతి ఊరు లోను దేవాలయాలు ఉన్నాయి. ఆజన్మాంతం శ్రీ రాముని సేవకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి అక్కడ మాత్రం దేవత రూపంలో పూజలు అందుకుంటున్నాడు. ఆ దేవాలయం ఎక్కడ ఉందో చూద్దాం.
ప్రపంచంలోనే ఆంజనేయుడిని స్త్రీ రూపంలో పూజించే దేవాలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రతన్ పూర్ జిల్లాలో గిర్జ్ బంద్ లో ఉంది. ఇక్కడ దేవత రూపంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులు ఏది కోరుకుంటే అది నెరవేరుతుందని నమ్మకం. ఇంకా ఇక్కడ రాముడు, సీతాదేవిలను తన భుజాలపై మోస్తున్న ఆంజనేయుని విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఆంజనేయుని భక్తుడైన రతన్ పూర్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ రాజు తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు.దానితో హనుమంతుడిని ప్రార్థించగా ఆయన తన ఆలయం నిర్మించమని కలలో ఆదేశించాడు.
హనుమ ఆదేశం మేరకు గుడి నిర్మాణం చేపట్టిన రాజుకి మళ్ళి కలలో కనిపించిన ఆంజనేయుడు మహామాయ కుండ్ వద్ద ఉన్న విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ట జరపమని ఆదేశించాడు. తరువాత రాజు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండటం చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ గుడి పూర్తయ్యే సరికి ఆ రాజు ఆరోగ్యం కుదుట పడింది. ఇక్కడి స్వామిని దర్శించుకోవాలంటే శీతాకాలం లో అక్టోబర్ నుండి మార్చ్ మద్య కాలంలో సరైన సమయం.