నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు లిపులేఖ్, కాలాపాని ప్రాంతాలు తమ భూభాగాలన్న కేపీ ఓలీ. ఇప్పుడు ఏకంగా భారత్‌లో ఉన్నది నకిలీ అయోధ్య అని నిజమైన అయోధ్య నేపాల్‌లో ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భారత్‌లో ఉన్నది నకిలీ అయోధ్య. నిజమైన అయోధ్య నేపాల్‌లోని థోరీలో ఉంది. శ్రీ రాముడు నేపాలీ. భారతీయుడు కాదు. రాముడి జన్మభూమి తమదని చెప్పుకుంటూ భారత్ సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతోంది.’ అని ఓలీ వ్యాఖ్యానించారు.
నేపాల్ ప్రధాని కేపీ ఓలీ కొన్ని రోజులుగా చెలరేగిపోతున్నారు. పైగా తమ దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఇండియానే కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఇటీవల భారతీయ న్యూస్ ఛానెళ్లపైనా నిషేధం విధించారు. ఐతే ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుగా ఉన్నారు. ఓలీ వల్లే భారత్‌తో నేపాల్ సంబంధాలు దెబ్బతింటున్నాయని.. వెంటనే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.