గత కొన్ని రోజులుగా అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన మహారాష్ట్ర రాజకీయం…ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది…ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలడంతో..బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనమైంది. అటు ఉద్ధవ్ ఠాక్రే సైతం సీఎం పదవితో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శివసేన పార్టీ రెండుగా చీలడంతో..ఉద్ధవ్ ప్రభుత్వానికి మెజారిటీ తగ్గింది..ఈ క్రమంలోనే బల నిరూపణ చేసుకోవాలంటూ.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఉద్ధవ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై స్టే ఇవ్వాలని శివసేన సుప్రీం కోర్టుకు వెళ్లింది…కానీ అక్కడ కూడా శివసేనకు ఎదురుదెబ్బ తగిలింది…స్టే రాలేదు. దీంతో ఉద్ధవ్ రాజీనామా చేసేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైందనే చెప్పాలి.
అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక….అనేక రాష్ట్రాల్లో గెలవకపోయిన..ఇతర ప్రభుత్వాలని పడగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రాల్లో సైతం అధికారం దక్కించుకుంది. ఎప్పటికప్పుడు ఇతర ప్రభుత్వాల్లోనే ఎమ్మెల్యేలని చీల్చడం…బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇదే క్రమంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్నాయి. ఇక అతి పెద్ద మెజారిటీతో ఉన్న బీజేపీ మాత్రం ప్రతిపక్షానికి పరిమితమైంది.
ఇక ఉద్ధవ్ ప్రభుత్వం వచ్చిన 31 నెలల తర్వాత…అనూహ్యంగా శివసేనలోని కొందరు ఎమ్మెల్యేలు ఉద్ధవ్ కు వ్యతిరేకంగా మారారు. ఏకనాథ్ షిండే నాయకత్వంలో 39 ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇక వారితో ఎన్ని రకాలుగా చర్చలు చేసిన సఫలం కాలేదు. చివరికి సుప్రీం కోర్టులో సైతం ఎదురుదెబ్బ తగలడంతో ఉద్ధవ్…సీఎం పదవికి రాజీనామా చేశారు.
అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షలో బీజేపీ నెగ్గి…ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో మెజారిటీ మార్క్ 144..ఇక పార్టీల వారీగా బల బలాలు ఒక్కసారి చూస్తే…బీజేపీకి 106, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ పార్టీకి 44 స్థానాలు ఉండగా, శివసేనకు 55 స్థానాలు ఉండేవి…కానీ 39 మంది రెబల్స్ బయటకొచ్చారు. అలాగే ఇతర పార్టీలకు, స్వతంత్ర అభ్యర్ధులు కొందరు ఉన్నారు. రెబల్స్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ చేస్తే..ఆటోమేటిక్ గా మహారాష్ట్రలో కమలం వికసించనుంది..మరోమారు దేవేందర్ ఫడ్నవిస్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి.