దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబేతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. సోనియా గాంధీ స్థానంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టబోయేది ఎవరన్నది ఎట్టకేలకు తేలిపోయింది. అధ్యక్ష ఎన్నికల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు వేసిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏఐసీసీ అధ్యక్షుడిగా బరిలో నిలిచిన శశిథరూర్ పై మరో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఘనవిజయం సాధించారు. 7897 ఓట్లతో ఖర్గే క్లీన్ స్వీప్ చేశారు. మరో అభ్యర్థి శశిథరూర్ 1072 ఓట్లతో సరిపెట్టుకున్నారు.
ఖర్గే ఘన విజయంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం చోటుచేసుకుంది. ఖర్గే తరఫున కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ఖర్గేకు అభినందనలు తెలిపింది. ఇతర నేతలు కూడా ఖర్గేను శుభాకాంక్షలతో ముంచెత్తారు.
అధ్యక్ష ఎన్నికకు అక్టోబరు 17న పోలింగ్ చేపట్టగా దేశవ్యాప్తంగా దాదాపు 9,500 మంది (96శాతం మంది) పార్టీ ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అన్ని రాష్ట్రాల్లోని బ్యాలెట్ బాక్సులను దిల్లీకి తీసుకొచ్చి నేడు లెక్కింపు చేపట్టారు. 137 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో తాజా ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత మళ్లీ గాంధీ కుటుంబేతర వ్యక్తులు కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటున్నారు.