వారానికొకసారే దర్శనమిచ్చే లక్ష్మీనరసింహ స్వామి గుడి.. ఎక్కడుందంటే..?

-

భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. మన దేశంలో ఆధ్యాత్మికతకు ఉన్న ప్రత్యేకతే వేరు. ఎన్నో అద్భుతమైన దేవాలయాలకు నిలయం మన దేశం. మరెన్నో వింతలకు, ఆసక్తికరమైన ఆచారాలకు పుట్టినల్లు. మన దేశంలోని ఆలయాల ఆర్కిటెక్చర్ ప్రపంచానికి మార్గదర్శకం. ఇలాంటి భారతదేశంలో ఉన్న ఆలయాల్లో కొన్ని ఆలయాలకు మాత్రం చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆ స్పెషాలిటీయే వాటిని మిగతావాటన్నింటికి భిన్నంగా చూపెడుతుంది. అలాంటి ఓ ఆలయం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. ఈ ఆలయం ఎక్కడో నార్త్ ఇండియాలో లేదు. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్​లో ఉంది. మరి ఆలయం ఏంటి..? దాని స్టోరీ ఏంటో తెలుసుకుందామా..?

సాధారణంగా ఏ గుడిలోనైనా దైవదర్శనం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా రోజులో మూడు సార్లు, కొన్ని ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం ఇలా రెండు సార్లు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా వలేటివారి పాలెం మండలంలో ఉన్న మాలకొండపై వెలసిన జ్వాలా నరసింహస్వామి ఆలయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నం. ఈ ఆలయంలో వారానికి ఒక్కసారి మాత్రమే స్వామి దర్శనం కలుగుతుంది. ఎందుకంటే..?

పురాణాల ప్రకారం.. ఓ రోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఓ కోరిక కోరిందట. అదేంటంటే.. ఈ మాలకొండపై కొలువు దీరమని. లక్ష్మీదేవి కోరిక మేరకు విష్ణుమూర్తి ఇక్కడ మాల్యాద్రి నరసింహుడిగా వెలిశాడని అంటుంటారు. ఈ ప్రాంతానికే అగస్త్య ముని తపస్సు చేసుకోవడానికి వచ్చాడడట. అగస్త్యుడి కోరిక మేరకు కలికాలంలో ప్రజల పాపాలు పోగొట్టడానికి కలి నుంచి వారిని రక్షించడానికి ఇక్కడ కొలువుదీరాడని ఇంకో కథనం చెబుతోంది. ఇక్కడ వెలసిన స్వామి ఈ కొండపై తపస్సు చేసే మునులు, దేవతలు, యక్షులు, కిన్నెర, కింపురుషాదులకు ప్రతిరోజు దర్శనమిస్తాడు. కానీ భక్తులకు మాత్రం కేవలం ఒకరోజు అదికూడా శనివారం రోజు తన దర్శనం చేసుకునే భాగ్యం కలిగిస్తాడని ప్రచారంలో ఉంది.

మాల్యాద్రి నరసింహ స్వామిని దర్శించుకోవడానికి కొండపైకి మెట్ల మార్గం ఉంది. అక్కడికి వాహనాలు కూడా వెళ్తాయి. కొండపై ఉన్న రెండు పెద్ద బండ రాళ్ల మధ్య దారి ఉంటుంది. ఈ రాళ్ల మధ్యనుంచి వెళ్లేటప్పుడు రాళ్లు శరీరానికి తాకుతున్నట్టు ఉంటాయి. వారంలో ఒక్కరోజే ఆలయం తెరిచి ఉండడంతో ప్రతి శనివారం వేలాది భక్తులతో ఆలయం కళకళలాడుతుంటుంది. భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతుల కోసం ఆలయ అధికారులు 2019లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 10 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి టెండర్లు పిలిచారు. త్వరలో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు కాబోతున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news