ఏటీఎంలో క్యాష్ తీసివ్వమంటే.. కార్డులే మార్చేశాడుగా..

-

మీరు ఏటీఎం వద్ద నగదు డ్రా చేయడానికి వెళ్లినప్పుడు అపరిచితులను సాయం కోరుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. సాయం చేస్తున్నట్లు నటించి మీ డబ్బులు, కార్డులు ఎత్తుకుపోతారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అందుకే ఏటీఎంల వద్ద జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు. ఏటీఎం వద్ద కన్పించిన ఒక అపరిచిత వ్యక్తిని నగదు డ్రా చేసిపెట్టమంటే ఏటీఎం కార్డులు మార్చేసి, ఆ తర్వాత ఆ ఖాతాలోని డబ్బు ఖాళీచేసిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.

కృష్ణా జిల్లాలో  9వ వార్డు కట్లపల్లి పేర్ని కృష్ణమూర్తి కాలనీకి చెందిన మహిళ హాజెన్నీ ఆగస్టు 27న పెడనలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడివాడ రోడ్డు బ్రాంచి ఏటీఎం వద్దకు వెళ్లారు. కార్డు ద్వారా నగదు ఎలా తీయాలో ఆమెకు తెలియకపోవడంతో అప్పటికే అక్కడున్న ఓ అపరిచిత వ్యక్తిని తన ఖాతాలో నుంచి రూ.5 వేలు తీసిపెట్టాలని కోరారు. అతనికి పిన్‌ నంబరు చెప్పారు. దీంతో ఆ వ్యక్తి ఆమె కోరినట్టుగానే రూ.5 వేలు డ్రాచేసి ఇచ్చారు.

అదే సమయంలో అతను తన వద్దనున్న ఏటీఎం కార్డును ఆమెకు ఇచ్చేసి, ఆమె కార్డును దాచేశాడు. అప్పటికి కార్డు మారినట్టు గుర్తించని హాజెన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక వెంటనే నగదును డ్రా చేయడం మొదలుపెట్టిన ఆ వ్యక్తి అదే ఏటీఎం నుంచి రూ.9,500 వంతున మూడు సార్లు మొత్తం రూ.28,500ను డ్రాచేశాడు. ఆ తర్వాత మచిలీపట్నంలోని చెమ్మనగిరిపేట ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లి అక్కడ రూ.6,500ను డ్రాచేశాడు.  అనంతరం ఉయ్యూరు ఐడీబీఐ ఏటీఎం నుంచి రూ.10 వేలు, రూ.4,700ను రెండు సార్లుగా తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.49,500ను ఏటీఎంల నుంచి వరుసగా చోరీచేసిన సదరు వ్యక్తి హాజెన్నీ ఖాతాలో బ్యాలెన్స్‌ కేవలం రూ.63 మాత్రమే ఉండడంతో ఆ కార్డును వాడడం ఆపేశాడు.

అయితే తన ఖాతా ఖాళీ అయినట్టు గురువారం తీసుకున్న బ్యాంకు స్టేట్‌మెంట్‌ ద్వారా తెలుసుకున్న బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదుచేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించామని, ఏటీఎంల వద్దనున్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఎస్సై టి.మురళి చెప్పారు. అపరిచిత వ్యక్తులకు ఏటీఎం పిన్‌ నంబర్లు చెప్పి మోసపోవద్దని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news