కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ధరణి పోర్టల్ సర్వే ఓ వ్యక్తి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని నందిగామ శంకరయ్య అనే 68 ఏళ్ళ వృద్దుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ధరణి సర్వేకు వచ్చిన వాళ్ళు తన ఫోటో తీసుకోలేదన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. శంకరయ్య పేరు మీద ఆస్తులు ఏమీ లేవు, ఆయన ఉన్న ఇల్లు, ఖాళీ స్థలం ఆయన అన్న, శంకరయ్య ఇద్దరి పేరిట ఉంది.
ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరి పేరు మీద ఆస్థి ఉంటే వారి ఫోటో మాత్రమే తీసుకోవాలి, జాయింట్ ప్రాపర్టీ కావడంతో శంకరయ్య అన్న ఫోటో మాత్రమే తీసుకుంది సర్వే బృందం. రూల్ ప్రకారం సర్వే రిపోర్టులో శంకరయ్య పేరు, ఆధార్ నెంబర్ నమోదు కూడా చేసుకుంది సర్వే బృందం. అయితే శంకరయ్య ఫోటో తీసుకోకుండ ఆయన అన్న ఫోటో మాత్రమే తీసుకోవడంతో తన పేరిట ఉన్న ఖాళీ స్థలం దక్కుతుందో లేదోనన్న ఆందోళనతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు చెబుతున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.