అట్టహాసంగా టీ కాంగ్రెస్ సద్బావన ర్యాలీ…!

హైదరాబాద్‌లో కాంగ్రెస్ సద్బావన సమావేశం అట్టహాసంగా సాగింది. భిన్నత్వంలో ఏకత్వం దేశ మూల సిద్దాంతమన్న మానిక్కమ్ ఠాగూర్.. ఆ విధంగా పార్టీని కూడా నడిపించడంలో సక్సెస్‌ అవుతున్నారనే దానికి ఈ సమావేశం వేదికైంది. చారిత్రక కట్టడం చార్మినార్‌ వద్ద రాజీవ్ గాంధీ 30వ సద్బావన యాత్ర కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభిచింది. తెలంగాణ ముఖ్యనేతలతో పాటు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మనిక్కమ్ ఠాగూర్ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి ఆరంభించారు.

ఐకమత్యంతో పని చేయాల్సిన సమయం ఆసన్నమైందన్న ఉత్తమ్.. మత సామరస్యమే కాంగ్రెస్ సిద్దాంతమన్నారు. దుబ్బాకతో పాటు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ సిద్ధాంతాలను నమ్ముకుంటుందని, సద్భావన గాంధీ సిద్ధాంతమని తెలిపారు. ఇతర మతాలనుగౌరవించడం మన సంప్రదాయమని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశ మూల సిద్ధాంతమని మనిక్కమ్ ఠాగూర్ తెలిపారు.