సాధారణంగా మనకు మార్కెట్‌లో పలు రకాల పండ్లు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ లభిస్తాయి. కిస్మిస్, బాదం, పిస్తా, ఆప్రికాట్స్.. ఇలా అనేక రకాలకు చెందిన డ్రై ఫ్రూట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి కొంచెం భిన్నంగా ఆలోచించాడు. కరోనా వల్ల అమ్ముడుపోని తన అరటిపండ్లను ఎలా అమ్మాలా అని ఆలోచిస్తూ.. వెంటనే ఉపాయం కనుగొన్నాడు. ఆ అరటి పండ్లను కూడా డ్రై ఫ్రూట్స్‌లా మార్చి వాటిని అమ్మడం మొదలు పెట్టాడు. అంతే.. ఇప్పుడతని డ్రై ఫ్రూట్స్ అరటి పండ్లకు చక్కని డిమాండ్ ఏర్పడింది. దీంతో అతను వాటిని అమ్ముతూ లాభాలు గడిస్తున్నాడు.
కర్ణాటకలోని బళ్లారి కంపిలి తాలూకా రామసాగర ప్రాంతానికి చెందిన కె.గంగాధర్ సుగంధి రకం అరటి పండ్లను పండించాడు. అయితే కరోనా వల్ల మార్కెట్ అంతగా లేదు. దీంతో పండ్ల అమ్మకాలు తగ్గాయి. అయితే తన కష్టం వృథా పోకూడదని భావించిన అతను ఆ అరటి పండ్లను పడేయకుండా ఎలాగైనా అమ్మాలని అనుకున్నాడు. అందులో భాగంగానే వాటిని డ్రై ఫ్రూట్స్ లాగా మార్చి అమ్మాలనే అద్భుతమైన ఆలోచన అతనికి వచ్చింది. అంతే.. వెంటనే ఆ ఆలోచనను అమలు చేశారు.
అలా గంగాధర్ ఆ అరటి పండ్లను స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరనలో నెల రోజులకు పైగా ఎండబెట్టాడు. అనంతరం వాటిని ప్యాక్ చేసి హోల్‌సేల్, రిటైల్ దుకాణాలకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో ఆ డ్రై ఫ్రూట్ అరటి పండ్లు బాగానే అమ్ముడవుతున్నాయి. దీంతో అతను లాభాలు గడిస్తున్నాడు. ఇక ఇతర డ్రై ఫ్రూట్స్ లాగే డ్రై ఫ్రూట్ అరటి పండ్లలోనూ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్ అరటి పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయని మరోవైపు రాయచూర్ వ్యవసాయ యూనివర్సిటీ కూడా చెప్పింది. దీంతో గంగాధర్ పండ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
అయితే ప్రస్తుతానికి అతని వద్ద ఉన్న పండ్లు అయిపోయినా.. తిరిగి వచ్చే పంటలో అరటిపండ్లను ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చి అమ్ముతానని గంగాధర్ చెబుతున్నాడు. అవును మరి.. మనస్సుంటే మార్గముంటుంది. నష్టం వస్తుందని ఊరుకోకుండా అతను తన ప్రయత్నం తాను చేశాడు. ఇప్పుడు లాభాలు ఆర్జిస్తున్నాడు. అతని పద్ధతి అందరికీ ఆచరణీయం..!